: జర్నలిస్టులపై బాలీవుడ్ సింగర్ అభిజీత్ అనుచిత వ్యాఖ్యలు... పోలీస్ కంప్లయింట్!
ఇద్దరు జర్నలిస్టులపై ట్విట్టర్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సింగర్ అభిజీత్ పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లవ్ జీహాద్ ఫలితమే చెన్నైలో జరిగిన టెకీ స్వాతి మర్డర్ అంటూ అభిజీత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాఖ్యానించాడు. హత్య చేసిన వ్యక్తి రామ్ కుమార్ అని, అతన్ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారంటూ ఢిల్లీ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ఆ ట్వీట్ కు స్పందించారు. ఈ తరహా వ్యాఖ్యల ద్వారా అభిజీత్ మతఘర్షణలకు పాల్పడుతున్నాడని.. పాకిస్థాన్ సింగర్లంటే అతనికి ఈర్ష్య అంటూ స్వాతి చతుర్వేది తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. ఈ ట్వీట్ తో మండిపడ్డ అభిజీత్, స్వాతిని దుర్భాషలాడుతూ మరో ట్వీట్ చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వాతితో పాటు 'జనతాకా రిపోర్టర్. కామ్' చీఫ్ ఎడిటర్ రిఫాత్ జవైద్ కూడా అభిజీత్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.