: హనుమంతుడిని పూజిస్తే శిక్షించే గ్రామం... ఎందుకో వివరించి చెబుతున్న ఊరి ప్రజలు!
ఉత్తరాఖండ్ లోని ద్రోణగిరి గ్రామం... అక్కడ నివసించే భూటియా అనే జాతి ప్రజలు ఓ వింత ఆచారాన్ని తరతరాలుగా పాటిస్తున్నారు. ఆ గ్రామంలో ఏ దేవుడినైనా పూజించవచ్చు, ఒక్క ఆంజనేయ స్వామిని తప్ప! ఎవరైనా హనుమంతుడిని పూజించినట్టు తెలిసినా, అసలా పేరు పలికినా దాన్ని నేరంగా భావించి, గ్రామం నుంచి బహిష్కరించేంత పెద్ద శిక్షలు వేస్తారు. ఇక హనుమంతుడిపై వారికి ఎందుకంత పగో తెలుసా? ఇదే విషయాన్ని అడిగితే గ్రామస్థులు ఓ కథ చెబుతారు. తన భార్యను అపహరించిన రావణుడితో, రాముడు యుద్ధం చేస్తున్న వేళ, రావణుడి పుత్రుడు ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చబోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హనుమంతుడు ఇదే ద్రోణగిరి ప్రాంతానికి వచ్చి, ఇక్కడున్న సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లిపోయాడట. ఇక్కడి ప్రజలు పరమ పవిత్రంగా పూజించుకునే కొండను హనుమంతుడు తీసుకెళ్లిపోవడమే వారి కోపానికి కారణం. తమకు వరప్రదాయినిగా ఉన్న సంజీవని కొండను తీసుకెళ్లిన ఆంజనేయుడిపై వీరు అందుకే కోపాన్ని పెంచుకున్నారు. అదే యుగయుగాలుగా కొనసాగుతోంది. అదీ సంగతి!