: విజయవాడలో కన్నా, సోము తదితర బీజేపీ నేతల ప్రెస్ మీట్ ను అడ్డుకున్న స్థానికులు
విజయవాడలో రోడ్ల విస్తరణ వివాదం మరింత పెద్దదవుతోంది. రహదార్లను విస్తరించాలంటూ పలు చిన్న చిన్న గుడులను అధికారులు తొలగిస్తున్న వేళ, నిరసన తెలియజేయడానికి వచ్చిన బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులను స్థానికులు అడ్డుకున్నారు. గోశాల వద్ద వీరు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, రాజకీయం చేయడానికి వచ్చారంటూ, కొందరు స్థానికులు అడ్డు తగలడంతో, బీజేపీ కార్యకర్తలు, స్థానికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. గుడులతో పాటు ఆ వెనకున్న ఇళ్లను కూడా తొలగించాలని వ్యాఖ్యానించడం గొడవకు కారణమైంది. తమ ఇళ్లను తొలగించాలని చెప్పడానికి మీరెవరని ప్రశ్నిస్తూ, పలువురు స్థానికులు అభ్యంతరం చెప్పారు. తాము ఇళ్లు కోల్పోతే మీరు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. కాగా, తమను అడ్డుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు చూస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. తమ ప్రెస్ మీట్ ను అడ్డుకోవడం ఏంటని వారిద్దరూ మండిపడ్డారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. సమయానికి స్పందించిన పోలీసులు, ఇరు వర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.