: గోదారమ్మకు జలకళ ... గణనీయంగా పెరుగుతున్న నీరు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో క్రమంగా నీరు పెరుగుతోంది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 28 అడుగులకు చేరడంతో స్నానఘట్టాలు మునిగిపోయాయి. మణుగూరు, ఏటూరునాగారం అడవుల్లో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోనే నదిలోకి నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. గోదావరిలో కలిసే పలు వాగులు, వంకలతో పాటు కిన్నెరసాని, తాలిపేరు నదుల్లో భారీ వరద సాగుతుండగా, వీటి గేట్లు తెరిచారు. మరోవైపు బాబ్లీ ప్రాజెక్టు నిండటంతో, అక్కడి నీరు కూడా గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల వారు, భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.