: రాత్రిపూట ఫోన్ చేసి బంగ్లాకు రమ్మంటున్నాడు: ఐజీపీపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
ఐజీపీ తనను లైంగికంగా వేధిస్తున్నారని చత్తీస్గఢ్ మహిళా కానిస్టేబుల్ ఒకరు డీజీపీకి ఫిర్యాదు చేశారు. బిలాస్పూర్ రేంజ్ ఐజీపీ పవన్దేవ్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, రాత్రివేళ ఫోన్ చేసి తన బంగ్లాకు రమ్మంటున్నారని మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 1992 ఐపీఎస్ అధికారి అయిన ఆయన తనతో మాట్లాడే సమయంలో అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదుతోపాటు ఆయన తనతో మాట్లాడిన ఫోన్ రికార్డింగులను కూడా ఆమె జతచేశారు. గత నెల 17-18 తేదీల్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బిలాస్పూర్ పర్యటన కోసం డ్యూటీలో ఉన్న తనకు ఐజీపీ ఫోన్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే ఆమె ఫిర్యాదును ఐజీపీ పవన్ దేవ్ ఖండించారు. ఆమెకు సన్నిహితంగా ఉండే పోలీస్ ఇన్స్పెక్టర్పై పలు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేశానని, దీంతో ఇద్దరూ కలిసి తనపై కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా కానిస్టుబుల్ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ మహిళా కమిషన్ సైతం డీజీపీకి లేఖ రాసింది.