: కొట్టడం తప్పు నాదే... అయితే, శ్రీశాంత్ తన నాటకాన్ని రక్తి కట్టించాడు: హర్భజన్
ఐపీఎల్ పోటీల సందర్భంగా శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడం తాను చేసిన పెద్ద తప్పని, ఆ విషయంలో ఇప్పటికీ సిగ్గు పడుతున్నానని క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన హర్భజన్, పలు పాత విషయాలను గుర్తు చేసుకున్నాడు. శ్రీశాంత్ తో వివాదంపై తను ఇంకోసారి క్షమాపణలు చెబుతున్నానని, అయితే, ఆ నాడు తన ఏడుపుతో శ్రీశాంత్ నాటకాన్ని రక్తి కట్టించాడని అన్నాడు. తాను గట్టిగా కొట్టేసినట్టు ఏడుపు లంఘించుకున్నాడని వ్యంగ్యంగా అన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో పోరులో తాను ఆడుతుంటే పదే పదే స్లెడ్జింగ్ చేస్తున్న డారెన్ లీమన్ ను హేళన చేశానని, అతనికి ఉన్న పెద్ద పొట్టను చూపిస్తూ, కడుపొచ్చిందా? అని అడిగానని అన్నాడు. తనను ఒక మాటంటే ఎదురు తిరిగి రెండు మాటలు అంటానని, అందువల్లే ఆస్ట్రేలియా క్రికెటర్లకు తానంటే భయమని చెప్పుకొచ్చాడు. సైమండ్స్ ను తాను 'కోతి' అనలేదని సైమండ్స్ కు హిందీ తెలియకపోవడమే సమస్యకు కారణమైందని వివరించాడు.