: మామా, అల్లుళ్ల మధ్య కోల్డ్ వార్: కేసీఆర్, హరీశ్ లపై తమ్మినేని


మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుల మధ్య కోల్డ్‌ వార్ నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఇద్దరు నేతలూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల బాధితులకు బాసటగా తమ్మినేని చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లా వేములగాట్ గ్రామానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇస్తామని చెబుతుంటే, హరీశ్ రావు 123 జీవోను వాడుకుంటామని చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు లేకుండా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని తమ్మినేని ప్రశ్నించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించడం ద్వారా ముంపు ప్రాంతాన్ని తగ్గించవచ్చన్న అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరిట భూమిని సేకరించి, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే కేసీఆర్ ప్రధాన ఉద్దేశమని విమర్శించారు.

  • Loading...

More Telugu News