: ఓటెయ్యకపోతే జరిమానా పడుద్ది... సన్నాహాలు చేస్తున్న ఆస్ట్రేలియా!
ప్రజాస్వామ్య దేశాల్లో వయోజనులందరికీ ఓటు హక్కు వుంటుంది. అయినప్పటికీ ఓటెయ్యడాన్ని కొంత మంది సీరియస్ గా తీసుకోరు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ఓటింగ్ శాతం దారుణంగా నమోదవుతోంది. ఇలాంటి సమస్యలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెక్ చెప్పాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సరికొత్త సంస్కరణలు అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఫెడరల్ ఎన్నికల్లో ఓటెయ్యని వారికి జరిమానా విధిస్తామని ఆ దేశ ఎలక్షన్ కమీషన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఓటెయ్యలేకపోవడానికి సహేతుకమైన కారణం చెప్పిన వారిని వదిలేస్తామని ఎలక్షన్ కమీషన్ పేర్కొంది. అలా సహేతుకమైన కారణం చెప్పని వారికి 20 డాలర్ల (దాదాపు 1300 రూపాయలు) జరిమానా విధిస్తామని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎలక్షన్ కమీషన్ వెల్లడించింది. ఎవరైనా సరైన కారణం చెప్పకుండా, జరిమానా కట్టకుండా మొండికేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు. విధించిన జరిమానాను చెల్లించక తప్పదని కమీషన్ వెల్లడించింది. ఈ చర్యల ద్వారా ఎన్నికల్లో ఓటింగ్ పెంచడంతో పాటు, ఓటేసేందుకు ప్రజలు ఎందుకు వెనుకాడుతున్నారో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని ఆసీస్ ఎలక్షన్ కమీషన్ పేర్కొంది.