: విశాఖలో బే మారథాన్ ప్రారంభం
విశాఖపట్టణంలో జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నైట్ బే మారథాన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రారంభమైన ఈ బే మారథాన్ లో సుమారు 7,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరంతా ఆర్కే బీచ్ నుంచి రుషికొండలో గల గీతమ్ కళాశాల వరకు పరుగెత్తనున్నారు. సుమారు 21 కిలోమీటర్ల ఈ దూరాన్ని అధిగమించే క్రమంలో పరుగు వీరులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల నిర్మానుష్యంగా ఉండే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ రహదారి మొత్తాన్ని ఎల్ఈడీ కాంతులతో నింపారు. కాగా, విశాఖ పర్యాటకానికి ఈ రోడ్డు మార్గం కీలకం కావడంతో దీనిని ప్రచారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ బీచ్ రోడ్డు మొత్తాన్ని భీమిలి వరకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎర్రమట్టిదిబ్బల మనుగడకు ప్రమాదం ఏర్పడిందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.