: నీ నిర్ణయం సరికాదు...ఆటలో ఇవి సహజం!: మెస్సీకి పీలే హితవు


అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయం సరికాదని బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే హితవు పలికాడు. తాజాగా అమెరికాలో హోరాహోరీగా జరిగిన కోపా కప్ ఫైనల్ లో రెండు జట్లు అద్భుతంగా ఆడడంతో, మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఈ పెనాల్టీ షూటౌట్ లో సూపర్ స్టార్ అయిన మెస్సీ లయతప్పాడు. పెనాల్టీని గోల్ గా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన మెస్సీ అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆట నుంచి రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించేశాడు. దీంతో ఫుట్ బాల్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ప్రస్తుత ప్రపంచ ఫుట్ బాల్ లో క్రిస్టియానో రోనాల్డో, మెస్సీ, రూనీ, నెయ్ మార్ లు సూపర్ స్టార్లు. మ్యాచ్ ను ఏ క్షణంలో అయినా మలుపుతిప్పగల సామర్థ్యమున్న ఆటగాళ్లు, వీరందర్లోకీ మెస్సీ ప్రత్యర్థులను ఏమార్చడంలో నేర్పరి. దీంతో అర్జెంటీనాతో తలపడిన ప్రతి జట్టూ మెస్సీని అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేస్తుంది. మెస్సీపై అంతా దృష్టిపెట్టిన వేళ, ఇతర ఆటగాళ్లు తమపని తాము చేసుకుపోతారు. అలాంటిది మెస్సీ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల ప్రపంచ దిగ్గజాలంతా స్పందించారు. ఆటలో ఒక్కోసారి ఇలాంటి రోజు వస్తుందని, ప్రతి ఆటగాడు ఒక్కొసారి విఫలమవుతాడని పీలే పేర్కొన్నాడు. ఒక్క పెనాల్టీ షూటౌట్ తప్పిందని రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదని ఆయన హితవు పలికాడు. నైపుణ్యమున్న మెస్సీ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని ఆయన సూచించాడు. మరి, మెస్సీ ఏమంటాడో చూడాలి. గతంలో మారడోనా కూడా ఇలాగే స్పందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News