: జగన్ తన పార్టీని మూసేయాలి: టీడీపీ నేత సోమిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ.. అక్రమాస్తుల కేసుల్లో ఉన్న జగన్‌కు వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. ఆ హోదానుంచి ఆయన తప్పుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. ఓ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని జప్తు చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా తన పార్టీని మూసేయాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ తనను నమ్ముకున్న వాళ్లనే జైలుకి పంపిన నేత అని ఆయన అన్నారు. జగన్ పార్టీ నేతలకు ఎక్కడకు వెళ్లినా అవమానాలు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు. 2004 లో రూ.9 లక్షలు ఉన్న జగన్ వార్షిక ఆదాయం ఇప్పుడు ఏ రీతిలో ఉందో ప్రజలు అందరికీ తెలుసని ఆయన అన్నారు. జగన్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారుగా ఉన్నారని, ఇది ఎలా సాధ్యమయిందని ఆయన ప్రశ్నించారు.