: ఢాకా ఉగ్రదాడిలో 20కి చేరిన మృతుల సంఖ్య!... బందీలకు విముక్తి!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఢాకాలోని దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న విదేశీయులను టార్గెట్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు గుల్షాన్ లోని హోలీ ఆర్టన్ బేకరీపై విరుచుకుపడ్డారు. బేకరరీలోకి ఎంటరైన వెంటనే ఇష్టారాజ్యంగా కాల్పులకు దిగిన ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అయితే దాడిపై సమాచారం అందుకున్న వెంటనే ఆ దేశ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ రంగంలోకి దిగి ఉగ్రవాదుల పీచమణిచింది. అయితే భద్రతా బలగాలతోనూ భీకర పోరు సాగించిన ఉగ్రవాదులు గంటల తరబడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొలుత ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు చనిపోగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా... తీవ్ర గాయాలైన మరో 13 మంది చనిపోయారు. ఇక ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న వారినందరినీ పోలీసులు సురక్షితంగా విడిపించగలిగారు.