: కాళ్లు లేవని నటిస్తూ అడుక్కుంటున్న సోమరి.. నిజం బయట పడడంతో జంప్
‘ఒళ్లు వంచకుండా డబ్బు సంపాదించాలి. చేసే వృత్తి అడుక్కోవడమయినా సరే.. ఈజీగా చేతిలో మనీ పడాలి. నటన సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కనబర్చొచ్చు. జనాలకి మనపై జాలి కలిగేలా ప్రవర్తించాలి. డబ్బులిచ్చే వారిని గుడ్డిగా నమ్మించేస్తే సరి..’ ఇవన్నీ ఒళ్లువంచకుండా సంపాదించాలనుకునే కొందరు సోమరుల ఆలోచనలు. ఆలోచనలే కాదు.. వారి ఆచరణలు కూడా. కాళ్లు విరిగిపోయిన వారిలా నిజజీవితంలో నటించేస్తున్నారు. గుడ్డివారిలా నటించి జనాలని మోసం చేయాలనుకుంటున్నారు. అలాంటి వేషాలు వేసి రోడ్లపై కూర్చొని అడుక్కుంటున్నారు. అయితే, వీరు అందరినీ మోసం చేయలేదు కదా..? ఒకవేళ వారి మోసాన్ని కనిపెట్టినా చూసీచూడనట్టు వదిలేస్తాం. కానీ, చైనా రాజధాని బీజింగ్‌లో కుంటి వాడిగా నటిస్తూ అడుక్కుంటోన్న ఓ సోమరిపోతు మోసాన్ని అందరి ముందు బయటపెట్టాడు ఓ వ్యక్తి. చక్రాల బండిపై పడుకొని కాళ్లులేని వ్యక్తిలా నటిస్తూ అడుక్కుంటోన్న ఓ బిక్షగాడిని గమనించిన ఓ వ్యక్తి అతని మోసాన్ని బయటపెట్టాడు. ప్యాంటులోపల కాళ్లు ముడుచుకొని, దాచుకొని అందర్నీ మోసం చేస్తూ కాళ్లు లేని వాడినని చెప్పుకుంటూ అడుక్కుంటోన్న వ్యక్తికి బుద్ధి వచ్చేలా చేశాడు. కాళ్లు లేనివాడినని అడుక్కుంటోన్న బిక్షగాడి దగ్గరికి వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ బిక్షగాడి ప్యాంటుని విప్పేశాడు. లో దుస్తుల్లో బిక్షగాడు తన రెండు కాళ్లను కట్టేసుకొని ఉండడాన్ని ఆయన బయట పెట్టాడు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన బిక్షగాడు జనాలు కొట్టకముందే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఈ దృశ్యాలు అక్కడి ఓ కెమెరా కంటికి చిక్కాయి.