: గుట్టుగా దాచిన సొమ్ము... టైం బాంబే!: అక్రమార్కుల్లో గుబులు రేపుతున్న ఐటీ శాఖ యాడ్!
గుట్టుగా దాచేసిన ఆదాయంపై కొరడా తప్పదని నరేంద్ర మోదీ సర్కారు తేల్చిచెప్పేసింది. ఇప్పటికీ ఎవరి వద్దైనా అలాంటి సొమ్ము ఉంటే సెప్టెంబర్ 30లోగా వెల్లడించేసి స్వల్ప పన్నుతో సేఫ్ జోన్ లోకి వెళ్లాలని కూడా కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై దేశ ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఓ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. సదరు ప్రకటన నేటి ఉదయం రిలీజైంది. పలు జాతీయ, ప్రాంతీయ ఛానెళ్లలో ప్రసారవుతున్న ఈ యాడ్ ఆసక్తికరంగా సాగుతోంది. సదరు యాడ్ లో గుట్టుగా దాచేసిన సొమ్మును ఆ శాఖ టైం బాంబుతో పోల్చింది. గుట్టుగా దాచేస్తున్న నిధులు త్వరలోనే టైం బాంబుగా మారిపోవడం ఖాయమని చెబుతూ రూపొందించిన ఆ యాడ్ లో... చేతికొచ్చిన ఆదాయాన్ని పన్ను కట్టకుండానే దాచేస్తున్న వ్యక్తి దర్శనమిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఓ సాంగ్ తో అతడికి ముచ్చెమటలు పడతాయి. ఈ క్రమంలోనే అలాంటి నిధి టైం బాంబుగా మారుతుందన్న హెచ్చరికతో సదరు వ్యక్తి పన్ను చెల్లించేందుకు సిద్ధమవుతాడు. గుట్టుగా దాచేస్తున్న సొమ్మును టైం బాంబుగా పోలుస్తూ ఆదాయపన్ను శాఖ రూపొందించిన ఆ యాడ్ అక్రమార్కుల్లో గుబులు రేపేలానే ఉంది.