: జంపింగ్ లు రాజీనామా చేసి గెలిస్తే... రాజకీయ సన్యాసం తీసుకుంటా!: టీడీపీకి పెద్దిరెడ్డి సవాల్
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి అధికార పార్టీ టీడీపీకి ఓ సవాల్ విసిరారు. తమ పార్టీ టికెట్లపై విజయం సాధించి టీడీపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి టీడీపీ టికెట్లపై గెలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో వారంతా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆయన సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి... తన పొరుగు నియోజకవర్గం పలమనేరు నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించి ఇటీవలే టీడీపీలో చేరిన అమర్ నాథ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిన్న తన సొంతూరులో ఈ ప్రకటన చేశారు. అమర్ నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఉప ఎన్నికల్లో నిలిపినా... పలమనేరులో ఎగిరేది వైసీపీ జెండానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదన్న దురుద్దేశంతోనే సీఎం నారా చంద్రబాబునాయుడు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెర తీశారని ఆయన ఆరోపించారు.