: ఢాకాలో ముగిసిన కౌంటర్ ఆపరేషన్!... ఆరుగురు ఉగ్రవాదులు హతం, ఏడుగురి అరెస్ట్!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గంటల తరబడి కొనసాగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. ఢాకాలోని విదేశీయులే లక్ష్యంగా విరుచుకుపడ్డ ఉగ్రవాదుల్లో ఆరుగురుని మట్టుబెట్టిన ఆ దేశ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్... మరో ఏడుగురిని సజీవంగా పట్టేసింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఢాకాలోని దౌత్య కార్యాలయాలున్న గుల్షాన్ ప్రాంతంలోని హోలి ఆర్టిసార్ బేకరిలోకి దూసుకెళ్లిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఏడుగురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. 60 మందిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా రంగంలోకి దిగిన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఉగ్రవాదుల పీచమణిచింది. ఉగ్రవాదుల చెరలోని వారినందరినీ సురక్షితంగా విడిపించగలిగిన బెటాలియన్ మొత్తం 13 మంది ఉగ్రవాదుల్లో ఆరుగురిని మట్టుబెట్టేసింది. ఇంకో ఏడుగురు తీవ్రవాదులను సజీవంగా పట్టుకోగలిగింది.