: ప్రమాదంలో మృతి చెందిన అన్న.. సోదరుడి చితిలో దూకి సజీవదహనమైన చెల్లెలు


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్న చితిపై పడి సోదరి సజీవ దహనమైన విషాద ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌‌ పట్టణం సతీరాంపూర్‌కు చెందిన వేల రామ్ మనత్(32) గురువారం రాత్రి దుంగార్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చితిపై మృతదేహం సగం కాలుతుండగా కుటుంబ సభ్యులు శ్మశానం నుంచి ఇంటికి బయలుదేరారు. వారు వెళ్లిపోయేంత వరకు అక్కడే ఉన్న రామ్ సోదరి దుర్గ (28) ఒక్కసారిగా చితిపైకి దూకింది. దీనిని చూసిన ఓ 14 ఏళ్ల బాలుడు విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుర్గ దేహం సగం కాలిపోయింది. ఆమె మృతదేహాన్ని చితి నుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుర్గ మానసిక స్థితి బాగాలేకపోవడంతో భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ముగ్గురు పిల్లల తల్లయిన ఆమె గత నాలుగేళ్లుగా తల్లిదండ్రులు, సోదరులతో కలిసి ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఆమె మందులు వేసుకోవడం లేదని, రెండు మూడు రోజుల్లో ఆస్పత్రికి తీసుకువెళ్లాలనుకున్నామని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని దుర్గ మరో సోదరుడు దినేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News