: బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారిపై దాడి.. పరిస్థితి విషమం
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఓ దేవాలయంలో పూజ చేసేందుకు సిద్ధమైన పూజారిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ఈరోజు అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. సత్‌ఖిరా జిల్లాలోని బ్రహ్మరాజ్‌పూర్ గ్రామంలోని శ్రీశ్రీ రాధా గోవింద ఆలయంలో 48 ఏళ్ల పూజారి బాబా సింధురాయ్‌పై దాడి జరిగింది. ఏడుగురు దుండగులు ఒక్కసారిగా అతడిపై దాడి చేసి అతని పొట్ట, వీపులో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులకు తెగబడిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.