: ఆ సమయంలో ఆయన విదేశాలకు చెక్కేస్తారు: రాహుల్ గాంధీపై సెటైర్లు వేసిన అమిత్‌షా


దేశంలో వాతావరణం వేడెక్కిన ప్రతిసారీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు చెక్కేస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సెటైర్లు వేశారు. గోరఖ్‌పూర్‌లోని బస్తీలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల బూత్ లెవల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో వాతావరణం వేడెక్కితే చాలు రాహుల్ బాబా విదేశాలకు వెళ్లిపోతారు. అక్కడి నుంచి బీజేపీ పాలనపై మాట్లాడతారు’’ అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లతో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదని, ఆ రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో దూరంగా విసిరికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2017 ఎన్నికల్లో బీజేపీని రికార్డు మెజారిటితో గెలిపించాలని కోరారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఈ రెండు పార్టీలేనన్న షా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పైనా విమర్శలు గుప్పించారు. దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన ప్రధాని(నరేంద్రమోదీ)ని బీజేపీ ఇస్తే, కాంగ్రెస్ ఎప్పుడో ఓసారి మాట్లాడే ప్రధాని(మన్మోహన్‌సింగ్)ని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం యూపీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని క్రిమినల్స్, మాఫియా నడిపిస్తోందని అమిత్ షా ఆరోపించారు.

  • Loading...

More Telugu News