: బంగ్లాదేశ్ పైనా ‘ఉగ్ర’ పంజా... ఏడుగురు మృతి, 60 మందిని బందీలుగా పట్టుకున్న వైనం!


ఉగ్రవాదులు విశ్వవ్యాప్తంగా పేట్రేగిపోతున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై భీకర దాడిని మరువక ముందే ఉగ్రవాదులు బంగ్లాదేశ్ పై పంజా విసిరారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అత్యాధునిక మారణాయుధాలు చేతబట్టిన పది మంది ఉగ్రవాదులు బంగ్లా రాజధాని ఢాకాలోని దౌత్య కార్యాలయాలకు అడ్డాగా ఉన్న గుల్షాన్ ప్రాంతానికి చెందిన హోలి అర్టిసాన్ బేకరి రెస్టారెంట్ లోకి చొరబడ్డారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఏడుగురు పౌరులు అక్కడికక్కడే చనిపోగా, 30 మంది గాయపడ్డారు. ఆ తర్వాత రెస్టారెంట్ లోని 60 మందిని ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై సమాచారం అందుకున్న బంగ్లా పోలీసులు వేగంగా స్పందించారు. ఉగ్రవాద చర్యను అణచివేసేందుకు హోలీ ఆర్టిసాన్ బేకరిని చుట్టుముట్టారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే, ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిలో 20 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఇక దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులంతా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్ధకు చెందిన వారేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News