: అందుకే అమరావతి అభివృద్ధిలో చైనా కంపెనీలకు భాగస్వామ్యం కల్పించాం!: చంద్రబాబునాయుడు


చైనాలో అద్భుతమైన నిర్మాణాలు తక్కువ వ్యవధిలో రూపుదిద్దుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మనకంటే ముందుగానే చైనాలో సంస్కరణలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. మనదగ్గర పట్టణాలు డిమాండ్ తో ఏర్పడుతున్నాయని, కానీ డిజైన్ ప్రకారం ఏర్పడాలని ఆయన అన్నారు. "గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాత నాతో మాట్లాడుతూ, చైనాలో 50 అంతస్తుల భవనం కేవలం 30 రోజుల వ్యవధిలో నిర్మించారని చెప్పారు. అలాంటి సామర్థ్యంతో భవనాలు నిర్మించే వెసులుబాటు మీకు ఉందని ప్రధాని నాతో చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. దానిని అందిపుచ్చుకుంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు" అన్నారు చంద్రబాబు. డ్రోన్స్, రోబోటిక్స్, హైస్పీడ్ రైళ్లు ఇలా ఎన్నో సాంకేతక సౌకర్యాలు చైనాకు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటన్నింటినీ వినియోగించుకున్న చైనా స్పీడ్, స్కిల్, స్కేల్ కు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. అందుకే అమరావతి అభివృద్ధిలో చైనా కంపెనీలకు భాగస్వామ్యం కల్పించామని ఆయన చెప్పారు. మనదేశంలో సుమారు 500 చైనా కంపెనీలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. చైనా నుంచి పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు చైనా కంపెనీ ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ కోసం ఓ అవగాహన చేసుకున్నామని ఆయన తెలిపారు. త్వరలో చేయనున్న సర్వేతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజల ప్రతి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News