: 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.. విద్యార్థి నుంచి సీఎం వరకు అందరూ నాటాలి: కేసీఆర్
హరితహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా ప్రజా ఉద్యమంలా నడవాలని ఆయన సూచించారు. ఈనెల 8న ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం రెండు వారాల పాటు కొనసాగాలని ఆయన ఆదేశించారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆయన అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం కోసం గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు ఆయా శాఖలు మూడు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 4న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యక్రమానికి తుది రూపునివ్వాలని ఆయన సూచించారు. 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, పాఠశాల విద్యార్థి నుంచి సీఎం వరకు అందరూ మొక్కలు నాటాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్ని చోట్ల హరితహారం నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పెట్టాలని ఆదేశించారు.