: నిధుల విడుదలలో వేగం పెంచండి!... జైట్లీకి చంద్రబాబు వినతి!


చైనా పర్యటన ముగించుకుని నిన్న రాత్రికే ఢిల్లీ చేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులతో చర్చలు మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లిన చంద్రబాబు... రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి బాసటగా నిలవాల్సిన గురుతర బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన ఈ సందర్భంగా జైట్లీకి గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల విడుదలలో వేగాన్ని పెంచాలని ఆయన కోరారు. ఇక జాతీయ ప్రాజెక్టు హోదాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు రూ.1,600 కోట్ల మేర తాము ఖర్చు పెట్టామని, ఆ నిధులను తక్షణమే విడుదల చేయాలని జైట్లీని చంద్రబాబు కోరారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నెలకొన్న ద్రవ్యలోటును భర్తీ చేయాలని కూడా ఆయన కోరారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని ఆయన అభ్యర్థించారు. చంద్రబాబు ప్రస్తావించిన అన్ని అంశాలను సాంతం విన్న జైట్లీ పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News