: గంగిరెడ్డి ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకు పైమాటే!... విదేశాల్లో రూ.వెయ్యి కోట్ల మేర నగదు!
శేషాచలం అడువుల్లోని విలువైన ఎర్ర చందనం చెట్లను నరికి, వాటిని దుంగలుగా మార్చి గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించడంతో కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగాడు. ఏపీలో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టేదాకా అతడి అక్రమ దందా యథేచ్ఛగా సాగింది. అయితే సీఎంగా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడి ఆటలకు చెక్ పడింది. దీంతో ఉన్నపళంగా దేశాన్ని వదిలి పరారైన గంగిరెడ్డి సింగపూర్ లో తలదాచుకున్నాడు. అయినా పట్టువీడని ఏపీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గంగిరెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ సర్కారు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో అతడు కూడబెట్టిన ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే షాక్ తిన్నారట. కడప జిల్లాలోని తన సొంత మండలం పుల్లంపేట, పొరుగు మండలం రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో అతడు విలువైన స్థలాలతో పాటు పల్వనైజింగ్ మిల్లులు, పెట్రోల్ పంపులు నడుపుతున్నట్లు తేలింది. వీటితో పాటు తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. వీటి విలువ ఎంతలేదన్నా రూ.2 వేల కోట్ల పైమాటేనని పోలీసులు చెబుతున్నారు. ఇక చాలా కాలం పాటు విదేశాల్లో తలదాచుకున్న అతడు అక్కడ రూ.1,000 కోట్లకు పైగానే నగదును కూడబెట్టినట్లు స్వయంగా అతడి అనుచరులే చెబుతున్నారు. వీటన్నిటినీ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.