: సీబీఐ కోర్టులో సాయిరెడ్డి, ఐఏఎస్ లు శ్రీలక్ష్మీ, మన్మోహన్ సింగ్!... జగన్ అక్రమాస్తుల కేసు 8కి వాయిదా!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ముగిసింది. కాసేపటి క్రితం జరిగిన ఈ కేసు విచారణకు ఏ-2 నిందితుడిగా ఉన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇక వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన వైఎస్ జగన్ నేటి విచారణకు హాజరుకాలేదు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కూడా ఈ విచారణకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 8కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే... కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల వ్యాపారానికి సంబంధించి కేసు విచారణకు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా నేడు సీబీఐ కోర్టుకు వచ్చారు.