: ‘కోహినూర్’పై మరో పిల్.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
యునైటెడ్ కింగ్డమ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. గతంలో దాఖలైన వాటితో కలిపి విచారించేందుకు సమ్మతించింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. పెండింగ్ పిల్లతో కలిపి విచారించనున్నట్టు పేర్కొంది. తాజా పిల్‌ను హెరిటేజ్ బంగ్లా అనే సంస్థ వేసింది. ‘‘1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. ఈ విషయం తెరపైకి వచ్చినప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించి సరిపెడుతున్నారు. భారత్‌కే తలమానికమైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి దేశానికి తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. డైమండ్లకే డైమండ్గా కొనియాడబడుతున్న కోహినూర్.. భారత సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమైపోయింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. గతంలో కోహినూర్ వజ్రంపై ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ పిల్ వేసిన సంగతి తెలిసిందే. కోహినూర్‌ను బ్రిటిష్ పాలకులు దొంగిలించడం కానీ, బలవంతంగా ఎత్తుకెళ్లడం కానీ చేయలేదని, పంజాబ్ రాజు ఈస్టిండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని గతంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే.