: తెలంగాణలో నిలిచిన ఆరోగ్య శ్రీ!... నిధులు విడుదల కాకపోవడమే కారణమట!


రాజీవ్ ఆరోగ్య శ్రీ... పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని దరి చేర్చిన మహోన్నత పథకం. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం లక్షలాది మంది పేదల ప్రాణాలను నిలిపింది. ప్రపంచ దేశాల్లో పేరెన్నికగన్న ఉత్తమ సంక్షేమ పథకంగానూ ఆరోగ్య శ్రీ రికార్డులకెక్కింది. అలాంటి పథకం నేటి ఉదయం నుంచి తెలంగాణలో నిలిచిపోయింది. ఈ పథకం నిబంధనల మేరకు పేదలకు ఉచితంగా చికిత్సలు అందించే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఆ తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆసుపత్రులకు కేసీఆర్ సర్కారు రూ.450 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే సేవలు నిలిపివేస్తామని చెప్పిన కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్ల మేర బకాయిలు విడుదల చేస్తామని చెప్పింది. అయితే ఇచ్చిన మాటను పక్కనబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.40 కోట్లను మాత్రమే విడుదల చేసింది. దీంతో భగ్గుమన్న ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు నిన్ననే ప్రకటించాయి. ఈ ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన రాని నేపథ్యంలో నేటి ఉదయం నుంచి తెలంగాణలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి.

  • Loading...

More Telugu News