: ఇరాన్, సిరియాలోని ఉగ్రవాదులతో నిత్యం టచ్ లో ఉన్న ఉగ్రవాదులు: రిమాండ్ రిపోర్ట్ ఇదే
హైదరాబాదు పాతబస్తీలో పట్టుబడిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలను పేర్కొన్నారు. హైదరాబాదుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విధ్వంసానికి ఈ గ్యాంగ్ ప్రణాళికలు రచించిందని తెలిపింది. వీరిని అదుపులోకి తీసుకున్న సందర్భంగా వీరి నుంచి భారీ ఎత్తున ఉగ్రవాద సాహిత్యం, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ ఫోన్ లతో ఇరాన్, సిరియాల్లో ఉండే తీవ్రవాదులతో నిత్యం టచ్ లో ఉండేవారని వారు పేర్కొన్నారు. సుమారు ప్రతి రోజూ మాట్లాడుకునేవారని తెలిపారు. భారతదేశంలో పాగా వేయాలనే లక్ష్యం, అదే సమయంలో తామంటే ప్రపంచం మొత్తం భయాందోళనలకు గురయ్యేలా చేయాలన్న లక్ష్యంతో భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడాలని నిర్ణయించారు. ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు దిగాలని, తద్వారా వీలైనంత ఎక్కువ నష్టం కలిగించాలని వారు భావించారు. ఈ మేరకు సిరియాలో ఉన్న ఉగ్రవాదుల నుంచి అందిన ఆదేశాల మేరకు హైదరాబాదును వారు టార్గెట్ చేశారు. ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించారు. హైదరాబాదులో రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పోలీస్ స్టేషన్లే లక్ష్యమని వారు తెలిపారు. కాగా వీరిని విచారించేందుకు 30 రోజుల రిమాండ్ కు వారిని అప్పగించాలని వారు సూచించారు. దీనిపై న్యాయస్థానం రేపు నిర్ణయం తీసుకోనుంది. కాగా, న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.