: బాంబు తయారీ విషయంలో ఆన్ లైన్ కోచింగ్... సిరియా ఉగ్రవాది నుంచి తర్ఫీదు తీసుకున్న హైదరాబాదు ఉగ్రవాది!
హైదరాబాదులోని పాతబస్తీలో ఎన్ఐఏ అధికారులకు పట్టుబడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాదులో బాంబు దాడుల కుట్రకు బీజం పడింది సిరియాలో అని విచారణలో తేలింది. సిరియాలో ఐసీస్ లో ఉంటున్న కర్ణాటక భత్కల్ జిల్లాకు చెందిన తీవ్రవాది షఫీ ఆర్మర్ ఆదేశాలతో హైదరాబాదులో తీవ్రవాదులు బాంబు దాడులకు పూనుకున్నారు. ఈ మేరకు షఫీ ఆర్మర్ తన సహచరులకు ఆన్ లైన్ లో బాంబు తయారీ పాఠాలు నేర్పాడు. బాంబు తయారీకి వాడే రసాయనాలు, బాంబు పరిమాణం, పేలుడు తీవ్రత, పేలుళ్ల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా చాలా విషయాలను హైదరాబాదుకు చెందిన తీవ్రవాది ఇబ్రహీం యజ్దానీకి నేర్పాడు. దీంతో ఫార్మస్యూటికల్స్ కంపెనీలకు విక్రయించే దుకాణాల నుంచి కెమికల్స్ కొనుగోలు చేశాడు. బాంబు పేలుళ్ల సందర్భంగా, ముడిసరుకుల కొనుగోలు సందర్భంగా అనుమానం వచ్చి కాల్పులు జరిగితే రక్షించుకునేందుకు నాందేడ్ నుంచి తుపాకీ, తూటాలు కొనుగోలు చేశారు. కేవలం రెండు రోజుల్లోనే బాంబులు తయారు చేసి, వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడాలని భావించారు. ఈ పేలుళ్లలో ఐదుగురు వ్యక్తులు పాలుపంచుకోవాలని భావించారు. ఇంతలో నిఘా అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పెను ముప్పు తప్పింది.