: భూములు లాక్కునే విషయంలో చంద్రబాబుకు, కేసీఆర్ కు పెద్ద తేడా లేదు!: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విమర్శ
పేద రైతుల నుంచి భూములు లాక్కునే విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కు పెద్ద తేడా ఏమీ లేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ రాఘవన్ వ్యాఖ్యానించారు. ఈరోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ రాఘవన్ మాట్లాడుతూ, ప్రాజెక్టులు, రీడిజైనింగ్, సచివాలయమంటూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేదల భూములను అన్యాయంగా లాక్కుని వాటిని కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులను కేసీఆర్ స్వయంగా కలిసి వారిని ఒప్పించేలా చేయాలే తప్ప, బెదిరించడం సబబు కాదని ఆయన అన్నారు. ఈ భూముల విషయంలో 123 జీవోను అనుసరించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారని విజయ్ రాఘవన్ విమర్శించారు. కాగా, నిత్యావసరాల ధరలు, సాగునీరు, తాగునీరు తదితర అంశాలకు సంబంధించి ఈ సభలో తీర్మానాలు చేశారు.