: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కి పేరొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది!: ఉత్తమ్‌కుమార్
సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అసత్యప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్క్‌షాప్ నిర్వహించింది. నిపుణులు తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు వివరించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదంటూ ప్రభుత్వ నేతలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని గణాంకాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ముగింపు దశలో ఉండగా ఆగిపోయాయని, వాటిని పూర్తిచేస్తే కాంగ్రెస్‌కి పేరొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోందని ఉత్తమ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమీషన్లకు ఆశపడే రీ-డిజైన్ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆయన ఆరోపించారు.