: సుజనా చౌదరి కుట్ర పన్నుతున్నారు...ప్యాకేజీకి సిద్ధమంటున్నారు: చలసాని శ్రీనివాస్


కేంద్ర మంత్రి సుజనా చౌదరి తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీలో కూర్చుని కుట్రలు పన్నుతున్నారని ప్రత్యేకహోదా ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 70 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిధ్దమవుతున్నాయన్న సమాచారం ఉందని అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేకహోదా ప్రకారం, ఇతర రాయితీలను కలుపుకుంటే మరింత ఎక్కువ సాయం వస్తుందని ఆయన చెప్పారు. అధికారంలోకి రాకముందు సొంత రాష్ట్రం అని మాట్లాడిన వెంకయ్యనాయుడు అధికారంలోకి రాగానే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తినని అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా 'ఎవరికి వారే యమునాతీరే'గా వ్యవహరిస్తే, తెలుగు జాతి క్షమించదని ఆయన తెలిపారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి తలవంచుకుని వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్రం ముందు ఎందుకు తలవంచుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. టీడీపీ, బీజేపీలు తెలుగు జాతికి అన్యాయం చేయకుండా తక్షణం అఖిల పక్షం వేసి, ప్రజాసంఘాలతో కలిసి ఢిల్లీ వెళ్లి ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదా, నిధులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News