: జగన్కు దోచుకోవడమే తెలుసు.. ఆస్తులను ఈడీ అటాచ్ చేయడమే నిదర్శనం!: గాలి ముద్దుకృష్ణమ
వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరోసారి మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం అంశంలో వైసీపీ నేతలు అనవసర విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ‘సింగపూర్ వాళ్లు అమరావతిలో భవనాలు నిర్మిస్తారు.. అంతేకానీ వాళ్లు ఇక్కడి నుంచి ఏం ఎత్తుకుపోతారు..?’ అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని ప్రపంచంలోనే గొప్పగా తీర్చిదిద్దాలని చూస్తుంటే వైసీపీ నేతలు దానికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి దోచుకుపోవడం తప్ప ఇంకేం తెలుసని ఆయన ప్రశ్నించారు. ఈడీ జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ఆయన దోపిడీకి నిదర్శనమని ముద్దుకృష్ణ వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజన అంశంపై ముద్దుకృష్ణమ స్పందిస్తూ.. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ విధానం మంచిది కాదని ఆయన అన్నారు. హైకోర్టును విభజించడంలో తమకు అభ్యంతరం లేదని, కేంద్రం దానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఆయన వ్యాఖ్యానించారు.