: అలియా అభినయానికి జాతీయ అవార్డు రావాలి: కరీనా
పంజాబ్ డ్రగ్ మాఫియా ఇతివృత్తంతో రూపొంది, ఇటీవల విడుదలైన 'ఉడ్తా పంజాబ్' సినిమాలో యువనటి అలియా భట్ అభినయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. ఈ కోవలో సీనియర్ నటి కరీనా కపూర్ కూడా చేరింది. తాజాగా ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన షాహిద్ కపూర్ మాట్లాడుతూ, అలియా భట్ కు జాతీయ అవార్డు ఇవ్వాలని సూచించాడు. అతని వాదనతో కరీనా కూడా ఏకీభవించింది. డ్రగ్స్ బాధితురాలిగా అలియా భట్ అద్భుతమైన నటనను ప్రదర్శించిందని, ఒక విధంగా చెప్పాలంటే పాత్రలో జీవించిందని ప్రశంసించింది. ఇలాంటి పాత్రకు జాతీయ అవార్డు లభించాలని ఆకాంక్షించింది. అయితే, ప్రేక్షకుల ఆదరాభిమానాలను మించిన అవార్డులు ఉండవని గుర్తుంచుకోవాలని కూడా సూచించింది.