: ప్రియురాలు అర్పితను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డ్యాన్సర్ సచిన్


తన ప్రియురాలు అర్పితను హత్య చేసిన ఢిల్లీలోని ఏబీసీ డ్యాన్స్ అకాడమీ యజమాని సచిన్, ఆపై అదే చోట ఉరేసుకుని మరణించడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, దక్షిణ ఢిల్లీలోని ఇగ్నోవ్ సమీపంలో సచిన్ డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తూ, ఓ డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. ఓ ఏడాది క్రితం నృత్యం నేర్చుకోవాలన్న కోరికతో అర్పిత స్కూలుకు రాగా వారిద్దరి మధ్యా తొలి చూపు ప్రేమ చిగురించింది. ఆపై ఇద్దరి మధ్యా అక్రమ సంబంధపు అనుమానాలు పెరిగాయి. మంగళవారం రాత్రి వారిద్దరి మధ్యా జరిగిన గొడవ తరువాత అర్పిత గొంతును వైరుతో బలంగా చుట్టి హత్య చేసిన సచిన్, ఆపై తను ఉరేసుకున్నాడు. కాగా, అర్పిత కుటుంబం ఆమెకు పెళ్లి నిశ్చయించగా, ఆ విషయం తెలుసుకున్న సచిన్ ఆమెను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఓ వాదన వినిపిస్తుండగా, వారిద్దరికీ వేర్వేరుగా అఫైర్లు ఉన్నాయని, ఆ గొడవలే ఈ దారుణానికి కారణం కావచ్చని కొందరు స్నేహితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News