: మీ హయాంలో రెండు వరల్డ్ కప్ ల్లో అపజయమేగా!... రవిశాస్త్రిపై గంభీర్ ఫైర్!
మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా మారింది టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పరిస్థితి. అసలే టీమిండియా హెడ్ కోచ్ పదవి దక్కక రవిశాస్త్రి అసహనంలో కూరుకుపోతే... ఓ వైపు శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్యలతో ఆయనకు తల బొప్పి కట్టించారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా నేటి ఉదయం ‘ఏబీపీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా రవిశాస్త్రిపై మాటల తూటాలు పేల్చాడు. ‘‘అసలు 18 నెలల పాటు జట్టు డైరెక్టర్ గా ఉండి ఏం సాధించారో చెప్పండి’’ అంటూ నేటి ఉదయం గంభీర్ సంధించిన ప్రశ్నలకు రవిశాస్త్రి వద్ద దాదాపుగా సమాధానం లేనట్టే. తన హయాంలో జట్టు అటు టెస్టుల్లోనే కాక పరిమిత ఓవర్ల ఫార్మాట్ లోనూ అగ్రగామిగా ఎదిగిందన్న రవిశాస్త్రి వ్యాఖ్యలను ప్రస్తావించిన గంభీర్... సదరు 18 నెలల కాలంలో వన్డే వరల్డ్ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లోనూ పేలవ ప్రదర్శన కనబరచిన వైనాన్ని గుర్తు చేశాడు. ‘‘విజయాలన్నీ మీ ఖాతాలో వేసుకుని అపజయాలు నావి కాదంటే కుదరదు’’ అన్న చందంగా గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.