: కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు... అమరావతిలో!: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. అమరావతిలో’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. హైకోర్టు విభజన అంశంలో గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. న్యాయవాదుల సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలతో పరిష్కరించుకోవాలని, కేంద్రాన్ని నిందించడం భావ్యం కాదని ఆయన అన్నారు. కేసీఆర్, చంద్రబాబు కొన్ని నెలల క్రితం ఒకరినొకరు రెండు సార్లు కలుసుకున్నారని అప్పుడు హైకోర్టు విభజనపై ఎందుకు మాట్లాడుకోలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తోందని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిదని ఆయన పేర్కొన్నారు. ఆప్షన్ల విధానంలో తెలంగాణ న్యాయవాదులకు జరుగుతోన్న అన్యాయం పట్ల గవర్నర్ కల్పించుకొని పరిష్కారాన్ని చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు తెలుపుతోన్న నిరసనకు బీజేపీ మద్దతు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.