: ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా... ఇప్పుడు జాతి వ్యతిరేక వేధింపులు: బ్రిటన్ తీరును కళ్లకు కడుతున్న ఎన్నారై కేశవ్ లేఖ


కేశవ్ కపూర్ (26).. బ్రిటన్ లోనే పుట్టాడు.. బ్రిటన్ లోనే పెరిగాడు. అక్కడి సంస్కృతిలో మమేకమైపోయాడు. శరీరపు రంగు మినహా అతను అచ్చంగా బ్రిటన్ పౌరుడే. కానీ, ఇప్పుడతన్ని బ్రిటన్ వాసిగా అక్కడి వారు అంగీకరించడం లేదు. బ్రెగ్జిట్ పై ఓటింగ్ అనంతరం తెలిసిన పక్క ఊరి వాళ్లు కూడా జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ, దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు ఎదురైన అనుభవంపై కేశవ్ రాసిన బహిరంగ లేఖను 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించింది. బ్రిటన్ తీరును మరోసారి ప్రపంచానికి వెల్లడించింది. కేశవ్ రాసిన లేఖ సంక్షిప్తంగా... "విభిన్న వర్గాల ప్రజలు నివసించే పశ్చిమ లండన్ లోని హోన్స్ లో ప్రాంతంలో 26 సంవత్సరాలుగా పెరిగాను. అడపాదడపా తెల్లవారి నుంచి కొన్ని జాతి వివక్ష వ్యాఖ్యలను విన్నాను. అవి ఎన్నడూ నన్ను బాధించలేదు. మా అమ్మ ఇక్కడికి పదేళ్ల వయసులో వచ్చింది. ఆపై 1980 ప్రాంతంలో నాన్న వచ్చి స్థిరపడ్డారు. నేను ఇక్కడ ఉంటున్నందుకు ఎంతో అదృష్టవంతుడినని అనుకునేవాడిని. కానీ నా అభిప్రాయం తప్పని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పటివరకూ కలసిమెలసి ఉన్నవారిని ఒక్కసారిగా దూరం పెట్టేంతగా మనసులు ఎలా మారుతాయో ఆశ్చర్యంగా ఉంది. నేనున్న ప్రాంతానికి ఇరుగు పొరుగుగా ఉండే హ్యేస్, హర్లింగ్టన్ ప్రాంతాల్లోని వారు ఇప్పుడు వివక్షాపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గత మంగళవారం నాకిదే అనుభవం ఎదురైంది. తమ దేశాన్ని విడిచి వెళ్లాలని రాయలేని తిట్లు తిట్టారు. దాడి చేశారు. నా మోకాలికి తగిలిన గాయం మానిపోతుంది. నా సెల్ ఫోన్ లో విరిగిన వాల్యూమ్ బటన్ ను తిరిగి అతికించలేకపోవచ్చు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ, స్పందించి వారితో వాదనకు, ప్రతిదాడికి దిగితే, ఏం జరుగుతుందో ఊహించలగను కాబట్టి మిన్నకుండిపోయాను. కానీ మనసు ఊరుకోవడం లేదు. ఇది ఈయూ నుంచి వీడిపోవాలని ఓట్లేసిన ప్రాంతం. రెఫరెండం రాజకీయాన్ని పక్కన బెడితే, ఇక్కడ జరుగుతున్న చర్చంతా వలసల గురించే. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటేసిన వారంతా జాతి వివక్షను చూపుతున్నారని అనడం లేదు. ఇదే సమయంలో ఈ తరహా ధోరణిని తమ మనసుల్లో పెంచుకుంటున్న వారి సంఖ్య మాత్రం అధికమవుతోంది. ఈయూను బ్రిటన్ వీడటమంటే, బ్రిటన్ లోని విదేశీయులందరినీ తరిమివేయవచ్చన్న భావనలో ఉన్న వారు ఎందరో కనిపిస్తున్నారు. కానీ నాలాంటి వారు సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఒంటరి కాదు. గత వారం వ్యవధిలో జాతి వివక్షపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జరిగిన ఘటనల సంఖ్యను పరిశీలిస్తే, విదేశీయులు ఎంత ఓపికగా ఉంటున్నారో తెలుస్తుంది. నేను కూడా ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. నాపై దాడి చేసిన వారిని గుర్తించాలన్న కోరిక కూడా లేదు. ఈ వేధింపులు యువత నుంచే వస్తున్నాయి. పెద్దలు తమ సంస్కృతి దెబ్బతింటోందన్న ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితి మారి జాతి వివక్ష లేని పాత బ్రిటన్ ను చూడాలని ఉంది. మేం బ్రిటీషర్లం. భయపడము, భయపడబోము నిశ్శబ్దంగా ఉండి ముందుకు సాగుతాం" కేశవ్ కపూర్ రాసిన ఈ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News