: నక్కల దండును చుట్టుముట్టిన రెండు సింహాలు!... పాంపోర్ దాడిపై హఫీజ్ బావమరిది ఘాటు వ్యాఖ్య!
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత్ లో విధ్వంసమే లక్ష్యంగా పాక్ లో పురుడుపోసుకున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తరహాలోనే ఆ సంస్థ కీలక నేత, సయీద్ బావమరిది అబ్దుర్ రెహ్మాన్ మక్కీ తన బావ కన్నా కరుడుగట్టిన ఉగ్రవాదిగా పరిణమించాడు. ఇటీవల కశ్మీర్ లోని పాంపోర్ లో సీఆర్పీఎఫ్ వాహనంపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 8 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిపై మక్కీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత సైనికులను 'నక్కల దండు’గా అభివర్ణించిన అతడు తమ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మాత్రం సింహాలుగా పేర్కొన్నాడు. ‘‘నక్కల దండును రెండు సింహాలు ముట్టడించాయి’’ అని మక్కీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జమాత్ సంస్థకు హఫీజ్ తర్వాతి స్థానంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. పాక్ లోని గుజ్రన్ వాలాలో జరిగిన ఓ సమావేశంలో తన బావ సయీద్ తో కలిసి వేదికనెక్కిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు పాకిస్థానీలు నడుం బిగించాలని కూడా అతడు పిలుపునిచ్చాడు. దాడి జరిగిన మరునాడు అతడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెట్ లో ప్రత్యక్షమైన వీడియో చెబుతోంది.