: ఎన్ఐఏకు ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించిన హైదరాబాద్ ఉగ్ర బ్యాచ్!


నిన్న ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అరెస్ట్ చేసిన ఉగ్రవాదులను విచారించిన అధికారులకు, వాళ్ల ప్రణాళికలు విని ఒళ్లు గగుర్పొడిచింది. హైదరాబాద్ లో వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో 500 మందిని చంపవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. భాగ్యనగరంలో బ్రసెల్స్ తరహా దాడులు చేయాలన్నది వారి ఉద్దేశమని, జనసమ్మర్ధం అధికంగా ఉండే మాల్స్, ఐటీ కంపెనీలపై దాడులు చేసి విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో పాటు వారు ఆత్మాహుతికి సిద్ధమైన ముష్కరులేనని తెలుస్తోంది. హైదరాబాద్ లో భద్రతా సిబ్బంది వాడుతున్న స్కానర్లు సైతం గుర్తించలేని పేలుడు పదార్థాలు వారి వద్ద ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో బెల్జియం రాజధాని బ్రసెల్స్ పై ఐఎస్ఐఎస్ వరుస పేలుళ్లకు పాల్పడింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీరు ప్రణాళికలు రూపొందించారు. బ్రసెల్స్ లో ఉగ్రవాదులు వాడిన ట్రై అసిటోన్, ట్రై పెరాక్సైడ్, టీఏటీపీ వంటి అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్థాలనే వీరు ఇక్కడకు చేర్చారు. వీటిని వాడేందుకు వారు శిక్షణ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి పెద్ద ఎత్తున హైడ్రోజన్ పెరాక్సైడ్, అసిటోసిన్ లు లభించడంతో ఎన్ఐఏ వర్గాలు విస్తుపోయాయి. వీరి ప్లాన్ అమలైతే పెను విధ్వంసమే జరిగుండేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బాంబులు తయారు చేసేందుకు పెద్ద వంటపాత్ర, పీడనాన్ని లెక్కించే ప్రెజర్ మీటర్లను వీరు సిద్ధంగా ఉంచుకున్నారు. వివిధ రకాల టైమర్లూ వీరి వద్ద లభించాయి. బండ్లగూడ ప్రాంతంలో బాంబులు తయారీ ప్రాక్టీస్ చేశారు. వీటిని శివారు ప్రాంతాల్లో పరిశీలించి కూడా చూశారు. సమయానికి వీరిని అరెస్ట్ చేయడంతో పెను విపత్తును ఆపగలిగామని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News