: నొప్పులతో విలవిల్లాడుతున్నా చేర్చుకునేందుకు నో చెప్పిన వైద్యులు.. ఆస్పత్రి టాయిలెట్‌లో ప్రసవం


ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ ఆస్పత్రి టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుందీ ఘటన. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఫాతిమా(37)ను ఆమె భర్త థనాభవన్ లోని హెల్త్ సెంటర్‌కు బుధవారం తీసుకొచ్చాడు. నొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను చేర్చుకోవాల్సిన వైద్యులు అందుకు నిరాకరించారు. మరో మూడు రోజుల తర్వాత ఆస్పత్రికి రావాలని తీరిగ్గా చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని దంపతులు కాసేపు అక్కడే ఉండిపోయారు. అనంతరం ఆస్పత్రిలోని టాయిలెట్‌కు వెళ్లిన బాధితురాలు అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన వైద్యులు అప్పుడు ఆమెను హుటాహుటిన లోనికి తీసుకెళ్లారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ చందర్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు చెప్పారు. చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News