: రెండడుగుల దూరంలో రెండు కుటుంబాలు ఆహుతవుతుంటే, నిస్సహాయులై.. చూస్తుండిపోయిన మిత్రులు!
ఇద్దరు మిత్రులు... తమ కుటుంబాలతో కలసి విహారయాత్రకు వెళ్లారు. ఓ ప్రమాదంలో కళ్లముందే రెండు కుటుంబాల్లోని చిన్నా, పెద్ద అగ్నికి ఆహుతవుతుంటే, నిస్సహాయులై చూస్తూ ఉండిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయిన అభాగ్యులుగా మిగిలారు. మనసును కదిల్చివేసే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తర కాలిఫోర్నియాలో ఆరాన్ హాన్ వింగ్, వెయ్ జియాంగ్ లీ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఓ మినీ వ్యానులో ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రకు వెళ్లారు. రెండు పర్వతాల మధ్య ఉన్న చిన్న దారిలో వెళుతుండగా, మరో వాహనం వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు జారిపోతుండగా, ముందు డోర్ తీసుకుని బయటకు వచ్చిన హాన్ వింగ్, జియాంగ్ లీలు వ్యాన్ లో చిక్కుకున్న తమ వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నలోపే మంటలు చెలరేగాయి. డోర్ బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటేనే, మంటలు పెరిగిపోగా, లోపలున్న ఆరుగురు హాహాకారాలు చేస్తూ సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకుని, పోలీసులు వచ్చే సరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తమ వారందరినీ పోగొట్టుకున్న ఇద్దరు మిత్రులూ మృతదేహాల ముందు కన్నీరుమున్నీరయ్యారు.