: జైలులో ఉంటూ జేఈఈలో విజయ దుందుభి మోగించిన హంతకుడి కొడుకు
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న తండ్రితోపాటు జైలులో ఉంటూనే ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈలో జయకేతనం ఎగురవేశాడో యువకుడు. కష్టపడేతత్వం, లక్ష్యం ముఖ్యం కానీ చదువుకు ప్రదేశంతో పనిలేదని నిరూపించాడు. ఓ హత్యకేసులో జైపూర్‌లోని కోటా ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి పూల్‌చంద్ కుమారుడు పీయూష్ మీనా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 453 ర్యాంకు(ఎస్టీ కేటగిరీ) సాధించి రికార్డు సృష్టించాడు. ఓపెన్ ఎయిర్ జైలు నిబంధనల ప్రకారం ఖైదీతో కలిసి ఉండేందుకు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. అంతేకాదు, రోజువారి సంపాదన కోసం బయటకు వెళ్లి పనిచేసేందుకు కూడా అనుమతిస్తారు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా పీయూష్ 2014లో జైలులోని తండ్రి వద్దకు చేరాడు. కుమారుడి కోచింగ్, హాస్టల్ ఫీజులు తదితరాల కోసం రూ.2 లక్షలు అవసరం కాగా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో లక్ష రూపాయలు సమకూర్చగలిగానని పూల్‌చంద్ పేర్కొన్నాడు. తన కుమారుడి ఐఐటీ కలను నెరవేర్చేందుకు ప్రైవేటు స్కూల్లో పనిచేద్దామనుకున్నా ఖైదీ కావడంతో అతనికి అనుమతి లభించలేదు. దీంతో తక్కువ వేతనానికి మెడికల్ స్టోర్‌లో హెల్పర్‌గా చేరాడు. కాగా ఓపెన్ ఎయిర్ జైలులోని తండ్రి ఉంటున్న గదికి చేరుకున్న పీయూష్.. జైలు నిబంధనల ప్రకారం అక్కడ చదువుకోవడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. రాత్రి 11 గంటలకే లైట్లు ఆపేస్తారని చెప్పుకొచ్చాడు. కిటీల నుంచి వచ్చే మసక వెలుతురులోనే చదువుకునేవాడినని తెలిపాడు. తన చదువుకు భంగం కలగకుండా ఉండేందుకు తండ్రి చాలా సమయం గది బయటే గడిపేవాడని పేర్కొన్నాడు. తెల్లవారుజామున 4 గంటల లోపు ఆయన ఎప్పుడూ గదిలోకి రాలేదని గుర్తుచేసుకున్నాడు. ‘‘నేనెప్పుడూ ఓ ఖైదీ కొడుకునని, నేను జైలులో ఉంటున్నానని ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పుకుంటా’’ అని గర్వంగా చెప్పాడు. జైలు నుంచి తండ్రి బయటకు వచ్చిన తర్వాత మంచి జీవితాన్ని ఇవ్వడమే తన లక్ష్యమని పీయూష్ పేర్కొన్నాడు. కాగా పూల్‌చంద్ ఇప్పటికే 12 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరో రెండేళ్లలో ఆయన శిక్షాకాలం పూర్తికానుంది.