: జూలై 4కు మారిన కేంద్ర కేబినెట్ విస్తరణ!... నజ్మా హెప్తుల్లా, గిరిరాజ్ సింగ్ లకు చేదువార్తే!
కేంద్ర కేబినెట్ విస్తరణ నేడు జరగనుందంటూ నిన్న వార్తలు వినిపించాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 లేదా 5కు వాయిదా వేసుకున్నారని తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యే వారి పేర్లతో పాటు కొత్తగా కేంద్ర మంత్రి పదవులు వరించే వారి లిస్టు కూడా ఇదేనంటూ జాతీయ మీడియా పలు ఊహాగానాలతో కథనాలు రాస్తోంది. కొత్తగా మంత్రులు కానున్న వారిలో పార్టీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్య నాథ్, సహరాన్ పూర్ ఎంపీ రాఘవ్ లఖన్ పాల్, మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లా, అదే రాష్ట్రానికి చెందిన మరో ఎంపీ రాజ్ వీర్ సింగ్ లకు కేబినెట్ బెర్తులు ఖరారైనట్లు సమాచారం. ఇక 75 ఏళ్లకు పైబడిన వయసు, ఆ మార్కుకు దరిదాపుల్లోకి వచ్చిన కేంద్ర మంత్రులను ఇంటికి సాగనంపేందుకు కూడా మోదీ నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి వారిలో కేంద్ర మంత్రులు నజ్మా హెప్తుల్లా, గిరి రాజ్ సింగ్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.