: ఎన్ఎస్‌జీలో భారత్ సభ్యత్వాన్ని ఏ ఒక్క దేశమో ఆడ్డుకోలేదు: చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టిన అమెరికా
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి అమెరికా కట్టుబడి ఉందని, ఏ ఒక్కదేశమో దానిని ఆపలేదని అమెరికా పేర్కొంది. ఎన్ఎస్‌జీలో ఇండియా చేరకుండా మోకాలడ్డుతున్నది తాము కాదని.. అమెరికాయేనని ఇటీవల చైనా బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఏ ఒక్కదేశమో భారత్ సభ్యత్వాన్ని ఆపలేదని పేర్కొంది. కాగా 48 దేశాల ఎన్ఎస్‌జీ గ్రూపులో భారత్‌కు సభ్యత్వం లభించకుండా చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఇండియాను అడ్డుకున్నది చైనా మాత్రమే కాదని యూఎస్ కూడా అని తాజాగా చైనా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అమెరికా సీనియర్ దౌత్యవేత్త థామస్ షానన్ స్పందించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ‘‘ఎన్ఎస్‌జీలో ఇండియా చేరేందుకు కట్టుబడి ఉన్నాం. భారత్‌ను ఏ ఒక్కదేశమో అడ్డుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా అణు సరఫరాదారుల బృందంలో భారత్‌కు చోటు లభించకున్నా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (ఎంటీసీఆర్)లో సభ్యత్వం లభించిన సంగతి తెలిసిందే.