: అవయవ దానానికి ఇక ’గ్రీన్ కారిడార్’ అవసరం లేదు!... అమరావతిలో ఎయిర్ అంబులెన్స్ లకు గ్రీన్ సిగ్నల్!
అవయవదానం... ప్రాణదానంతో సమానం. ప్రమాదాల్లో గాయపడ్డ వ్యక్తులు బతికే ఛాన్స్ లేదని వైద్యులు 'బ్రెయిన్ డెడ్'గా తేల్చేసిన సందర్భాల్లో సదరు వ్యక్తుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. ఈ సందర్భాల్లో సదరు వ్యక్తి నుంచి బయటకు తీసే అవయవాలను కేవలం గంటల వ్యవధిలో దాతలకు అమర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం అవయవాలతో తరలివెళ్లే అంబులెన్స్ లకు ట్రాఫిక్ చిక్కులు ఎదురు కాకుండా పోలీసులు ‘గ్రీన్ కారిడార్’ను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అయితే ఇకపై ఈ గ్రీన్ కారిడార్లు ఏపీలో అవసరం ఉండదు. ఎందుకంటే... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కేంద్రంగా ‘ఎయిర్ అంబులెన్స్’లకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న ఢిల్లీ వెళ్లిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ లు అక్కడ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సురేశ్ ప్రభు తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ అంబులెన్స్ లపై కామినేని ప్రతిపాదనకు అశోక్ గజపతిరాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.