: డ్రగ్స్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని.. కన్నతల్లిని తుపాకితో కాల్చి చంపిన తనయుడు
డ్రగ్స్ కొనుక్కునేందుకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన తల్లిని కాల్చి చంపాడో కొడుకు. పంజాబ్‌లోని మన్సాలో చోటుచేసుకుందీ ఘోరం. మాదకద్రవ్యాలకు బానిసగా మారిన బాలుడు(16) సోమవారం తల్లిని డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అతని గురించి తెలిసిన ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకుంటే తానేం చేస్తానో తనకే తెలియదని పెద్దగా అరుస్తూ తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు గమనించి రక్తపుమడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి తాత ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తుపాకి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.