: జగన్ ఇఫ్తార్ విందులో ఉండగా... కొరడా ఝుళిపించిన ఈడీ!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిన్న భారీ షాకిచ్చింది. ఇప్పటిదాకా మూడు పర్యాయాలు ఆయన ఆస్తులను అటాచ్ చేయగా, నిన్న నాలుగో విడతలో ఒకే దఫాలో రూ.750 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసింది. ఈ ఆస్తుల్లో హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఆయన ఇల్లుతో పాటు ఆయన కుటుంబం ఆధ్వర్యంలోని పత్రిక ప్రధాన కార్యాలయం ‘సాక్షి టవర్స్’, బెంగళూరులో తన అభిరుచుల మేరకు కట్టుకున్న రాజ భవంతి తదితరాలున్నాయి. తన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తూ ప్రకటించిన సమయంలో జగన్ ఇఫ్తార్ విందులో ఉన్నారట. మొన్నటిదాకా కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లి కులాసాగా గడిపి వచ్చిన జగన్... వచ్చీరాగానే పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అంతేకాకుండా ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని వైసీపీ మైనారిటీ విభాగం తెలంగాణ అధ్యక్షుడు మతీన్ ముజాయుద్దీన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు జగన్ స్వయంగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఉత్సాహంగా ఆయన విందులో పాల్గొన్నారు. జగన్ విందులో ఉండగానే ఈడీ ప్రకటన వెలువడింది. దీంతో ఒక్కసారిగా జగన్ ముఖ కవళికలు మారిపోయాయట!