: 'ఎయిట్'కు స్పెల్లింగ్ చెప్పమంటే నోరుతెరిచిన పాలి 'టెక్నిక్’ టాపర్లు
బీహార్ నకిలీ టాపర్ల వ్యవహారం ఇంకా మరవనే లేదు, ఉత్తరప్రదేశ్ లో ఇటువంటిదే మరో వ్యవహారం బయటపడింది. పొలిటికల్ సైన్స్ అంటే వంటశాస్త్రమని చెప్పి బీహార్ టాపర్ రూబీ రాయ్ ఆశ్చర్యపరిస్తే... ఎయిట్ (8) స్పెల్లింగ్ రాయమంటే బిక్కమొహాలేసుకుని చూశారు యూపీలోని పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు. యూపీలోని టెక్నికల్ బోర్డు మే 1వ తేదీన పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష నిర్వహించింది. లఖ్ నవూలోని 'బుద్ధం శరణం' ఇంటర్ కళాశాల సెంటర్ లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు మంచి స్కోరు చేసి టాపర్లుగా నిలిచారు. అయితే, ప్రవేశ పరీక్షా సమయంలో మోసాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు సంబంధిత అధికారులకు అందాయి. దీంతో, పాలిటెక్నిక్ టాపర్లకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అప్పుడు, వీరి బండారం బయటపడింది. ఎయిట్ (8)స్పెల్లింగ్ చెప్పమని ఆ ఇంటర్వ్యూలో అడుగగా సుమారు 28 మంది విద్యార్థులు నోరెళ్లబెట్టారు. దీంతో, ఆశ్చర్యపోయిన అధికారులు సదరు విద్యార్థుల ఫలితాలను రద్దు చేశారు. మళ్లీ పాలిటెక్నిక్ పరీక్ష రాసే అవకాశం లేకుండా చేశారు. అంతేకాకుండా, సదరు కళాశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.