: తెలంగాణలో కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం
పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని, దసరా నాడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రికి జిల్లాల విభజనపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పరిపాలనా సౌకర్యాలు చేరువలో ఉంటాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, ఏపీలో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన అన్నారు. జిల్లాల పునర్విభజన జరగకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు అందడం లేదని ఆయన అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు వస్తాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో సగటున 20 మండలాల ఏర్పాటు జరుపుతామన్నారు. అర్బన్ మండలాలుగా అధిక జనాభా కలిగిన నగరాలు, పట్టణాలను మార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లోనూ విస్తరించే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. కొత్త జిల్లాల కేంద్రాలన్నీ అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని, జిల్లాల పునర్విభజనపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని కేసీఆర్ అన్నారు.